te_obs/content/45.md

12 KiB

45. స్తెఫను, ఫిలిప్పు

OBS Image

ఆదిమ సంఘం క్రైస్తవులలో ఒక ముఖ్య నాయకుడు స్తెఫను. ప్రతీ ఒక్కరూ ఆయనను గౌరవించేవారు. పరిశుద్ధాత్మ వారికి అధిక శక్తినీ, జ్ఞానాన్నీ ఇచ్చాడు. స్తెఫను అనేక అద్భుతాలు చేసాడు. యేసు నందు విశ్వాసముంచాలని స్తెఫను బోధిస్తున్నప్పుడు అనేకులైన ప్రజలు యేసునందు విశ్వాసముంచారు.

OBS Image

ఒక రోజున స్తస్టేఫను యేసును గురించి బోధిస్తున్నాడు, యేసు నందు విశ్వాసం ఉంచని కొందరు యూదులు అక్కడికి వచ్చారు. అతనితో వాదించడం ఆరంభించారు. వారు చాలా కోపంగా ఉన్నారు. వారు మత నాయకుల వద్దకు వెళ్లి స్తెఫను గురించి అబద్దాలు చెప్పారు. వారు ఇలా చెప్పాడు, “ఇతడు దేవుని గురించీ మోషే గురించీ దుష్టమైన మాటలు పలుకుతుండడం మేము విన్నాం!” కనుక మతనాయకులు స్తెఫనును బంధించి ప్రధానయాజకుని వద్దకూ, ఇతర యూదా నాయకుల వద్దకూ తీసుకొని వచ్చారు. ఇంకా అనేకమంది అబద్దపు సాక్ష్యులు అతనికి వ్యతిరేకంగా అబద్దాలు చెప్పారు.

OBS Image

ప్రధాన యాజకుడు స్తెఫనును ఇలా అడిగాడు, “నీ గురించి వీరు చెప్పినవి సత్యములేనా?” ప్రధాన యాజకునికి జవాబు ఇవ్వడానికి స్తెఫను అనేక సంగతులు చెప్పడం ఆరంభించాడు. అబ్రాహాము కాలం మొదలుకొని యేసు కాలం వరకూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం అనేక అద్భుత కార్యాలు చేసాడని స్తెఫను వారితో చెప్పాడు. అయితే ప్రజలు ఎల్లప్పుడూ దేవుని అవిధేయత చూపిస్తూ వచ్చారు. “మీరు మూర్ఖులుగానూ దేవునికి తిరుగుబాటుదారులుగానూ ఉన్నారు. మీ పితరులు అన్ని సమయాలలో దేవునిని తృణీకరించి, ఆయన ప్రవక్తలను చంపిన విధంగా మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను తృణీకరించారు. వారు చేసిన దానికంటే దుర్మార్గపు కార్యం చేసారు. మీరు మెస్సీయను చంపారు!”

OBS Image

మతనాయకులు ఈ సంగతి వినినప్పుడు, వారు చాలా కోపగించుకొన్నారు, వారి చెవులు మూసుకొని గట్టిగా అరచారు. స్తెఫనును పట్టణం వెలుపలికి ఈడ్చుకొనిపోయి అతనిని చంపడానికి అతని మీద రాళ్ళు రువ్వారు.

OBS Image

స్తెఫను చనిపోతున్నప్పుడు అతడు బిగ్గరగా అరిచాడు, “యేసూ నా ఆత్మను నీ వద్దకు చేర్చుకో.” అతడు తన మోకాళ్ళమీద పడి మరల గట్టిగా అరచాడు, “ప్రభూ, ఈ పాపాన్ని వారిమీద మోపకుము.” అప్పుడు తన ప్రాణాన్ని విడిచాడు.

OBS Image

ఆ దినం, యెరూషలెంలోని అనేకులు యేసు అనుచరులను హింసించడం ఆరంభించారు. కనుక విశ్వాసులు ఇతర ప్రదేశాలను పారిపోయారు. అయితే ఇటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారు వెళ్ళిన ప్రతీ స్థలంలోనూ యేసును గురించి ప్రకటించారు.

OBS Image

ఫిలిప్పు అనే విశ్వాసి ఉండేవాడు. అతడు ఇతర విశ్వాసుల వలెనే అతడు యెరూషలెంనుండి సమరయ అనే ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ యేసును గురించి బోధించాడు. అతడు చెప్పిన బోధను అనేకులు విశ్వసించారు, రక్షణ పొందారు. ఒకరోజు దేవుని దూత ఫిలిప్పును అరణ్యప్రదేశంలోని ఒక మార్గానికి వెళ్ళమని చెప్పాడు. ఒకడు తన రధం మీద ప్రయాణం చెయ్యడం చూసాడు. అతడు ఇతియోపియా దేశానికి సంబంధించిన ముఖ్యమైన అధికారి. అతని వద్దకు వెళ్లి అతనితో మాట్లాడాలని పరిశుద్ధాత్మ చెప్పాడు.

OBS Image

కాబట్టి ఫిలిప్పు రధం వద్దకు వెళ్ళాడు. ఇతియోపీయుడైన అధికారి దేవుని వాక్యాన్ని చదవడం ఫిలిప్పు విన్నాడు. యెషయా ప్రవక్త రాసిన వచన భాగాన్ని అతడు చదువుతున్నాడు. అతడు “అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు. అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను. ఆ తరము వారిలో అతని గురించి ఆలో చించినవారెవరు?“ అను భాగాన్ని చదువుతున్నాడు.

OBS Image

ఫిలిప్పు అతనిని ఇలా అడిగాడు, “నీవు చదువుతున్నదానిని నీవు అర్థం చేసుకొంటున్నావా?” అందుకతడు ఇలా జవాబిచ్చాడు, “లేదు, ఒకరు నాకు వివరించకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది, దయచేసి పైకి రమ్ము, నా ప్రక్కన కూర్చోనుము. ప్రవక్త తన గురించి మాట్లాడుచున్నాడా? లేక మరొకరి గురించి మాట్లాడుచున్నాడా?”

OBS Image

ఫిలిప్పు రథంలోనికి వెళ్ళాడు, అతనితో కూర్చున్నాడు. అప్పుడు యెషయా ప్రవక్త ప్రభువైన యేసును గురించి రాస్తున్నాడని ఐతియోపీయుడైన అధికారికి వివరించాడు. దేవుని వాక్యంలోని అనేక ఇతర భాగాలను గురించి ఫిలిప్పు చెప్పాడు. ఈ విధంగా ఆ అధికారికి ఫిలిప్పు యేసును గురించిన సువార్తను ప్రకటించాడు.

OBS Image

ఫిలిప్పు, ఆ అధికారితో కలసి ప్రయాణిస్తుండగా వారు ఒక నీరున్న ప్రదేశానికి వచ్చారు. అప్పుడు ఆ ఐతియోపీయుడు ఇలా అన్నాడు, “చూడుము! ఇక్కడ కొంత నీరు ఉంది! నేను బాప్తిస్మం తీసుకోవచ్చునా?” అతడు తన రధమును నిలిపాడు.

OBS Image

కనుక వారు ఆ నీటి వద్దకు వెళ్ళారు, ఫిలిప్పు ఆ అధికారికి బాప్తిస్మం ఇచ్చాడు. వారు నీటి నుండి వెలుపలికి వచ్చినప్పుడు, అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ ఫిలిప్పును మరొక స్థలానికి కొనిపోయాడు. అక్కడ ఫిలిప్పు ప్రభువైన యేసును గురించి ప్రకటిస్తూ వచ్చాడు.

OBS Image

ఇతియోపీయుడు తన ఇంటి వైపుకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. యేసును కనుగొన్నందుకు అతడు అధిక సంతోషాన్ని పొందాడు.

అపొస్తలుల కార్యములు 6:8-8:5; 8:26-40 నుండి బైబిలు కథ