te_obs/content/28.md

5.9 KiB

28. ధనవంతుడైన యువ అధికారి

OBS Image

ఒక రోజున ధనవంతుడైన యువ అధికారి యేసు వద్దకు వచ్చి ఇలా అడిగాడు, “మంచి బోధకుడా, నిత్యజీవాన్ని స్వతంత్రించుకోడానికి నేనేమి చెయ్యాలి?” యేసు అతనితో ఆలా చెప్పాడు, “మంచి బోధకుడనని నన్ను నీవెందుకు పిలుస్తున్నావు? మంచి బోధకుడు ఒక్కడే ఉన్నాడు, దేవుడొక్కడే మంచి బోధకుడు. నిత్యజీవాన్ని స్వతంత్రించుకోడానికి నీవు దేవుని ధర్మశాస్తాన్ని అనుసరించు.”

OBS Image

అతడు యేసును అడిగాడు, “వేటికి నేను విధేయత చూపించాలి” అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు. “నరహత్య చెయ్యవద్దు, వ్యభిచారం చెయ్యవద్దు, దొంగిల వద్దు, అబద్దం చెప్పవద్దు. నీ తండ్రిని, తల్లిని సన్మానించాలి. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి.”

OBS Image

అయితే ఆ యువకుడు ఇలా అన్నాడు, “నేను చిన్న వయసునుండే వీటన్నిటినీ పాటిస్తున్నాను, నిత్యజీవాన్ని పొందడానికి నేను ఇంకా ఏమి చెయ్యాలి?” యేసు అతని వైపు చూచాడు, అతనిని ప్రేమించాడు.

OBS Image

యేసు అతనికి జవాబిచ్చాడు, “నీవు పరిపూర్ణుడవు కావాలంటే నీవు వెళ్లి నీకున్నదానిని అమ్మి ఆ డబ్బును పేదలకు పంచిపెట్టు, అప్పుడు నీకు పరలోకంలో ధనం అధికం అవుతుంది. అప్పుడు వచ్చి నన్ను వెంబడించు.”

OBS Image

యేసు చెప్పిన ఈ మాట ధనవంతుడైన ఈ యువకుడు విని చాలా దుఃఖపడ్డాడు, ఎందుకంటే అతడు మిక్కిలి ధనవంతుడు కనుక తనకున్న ఆస్తులను విడిచి పెట్టడానికి ఇష్టపడలేదు. అతడు వెనుక తిరిగి యేసు దగ్గర నుండి వెళ్ళిపోయాడు.

OBS Image

అప్పుడు యేసు తన శిష్యుల వైపుకు తిరిగి, “ధనవంతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అత్యంత దుర్లభం! అవును, ఒక ధనవంతుడు పరలోకంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరడం సులభం” అని అన్నాడు.

OBS Image

యేసు చెప్పిన ఈ మాట శిష్యులు వినినప్పుడు, వారు ఆశ్చర్యపోయారు. వారు ఇలా అన్నారు, “ఇలా అయితే దేవుడు ఎవరిని రక్షిస్తాడు?”

OBS Image

యేసు తన శిష్యుల వైపు తిరిగి ఇలా చెప్పాడు, “మనుష్యులు తమ్మును తాము రక్షించుకోవడం అసాధ్యం, అయితే దేవునికి సమస్తం సాధ్యమే.”

OBS Image

పేతురు యేసుతో ఇలా అన్నాడు, “శిష్యులమైన మేము సమస్తము విడిచి నిన్ను వెంబడించాం, మాకు వచ్చే బహుమతి ఏమిటి?”

OBS Image

యేసు ఇలా జవాబిచ్చాడు, “ఎవడైననూ తన ఇంటినైననూ, అన్నదమ్ములనైననూ, అక్కచెల్లెండ్రనైననూ, తండ్రినైననూ, తల్లినైననూ, పిల్లలనైననూ నా నిమిత్తం విడిచినట్లయితే దానికి నూరు రెట్లు ఫలమునూ, నిత్య జీవాన్ని పొందుతారు, అయితే మొదటివారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటివారు అవుతారు.”

మత్తయి 19:16-30; మార్కు 10:17-31; లూకా 18:18-30 నుండి బైబిలు కథ